మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..

దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్ల ప్రమాదాలకు తెర లేపుతున్నారు. కొంతమంది ఏకంగా రైళ్ల పట్టాలు తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనలకు సంబంధించిన వార్తలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. గుర్తు తెలియని దుండుగులు ఏకంగా రైలు పట్టాలపై ప్రమాదకరమైన సామగ్రిని ఉంచి పట్టాలు తప్పించేందుకు జరుగుతున్న కుట్ర కోణాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో రైలు ప్రయాణమంటే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. రాంపూర్, కాన్పూర్, ఘాజీపూర్, డియోరియా వంటి రైలు ప్రమాదాలకు కుట్ర పన్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రేమ్‌పూర్ స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి పన్నిన కుట్ర భగ్నమైంది.

 

ఉత్తర ప్రదేశ్‌లోని ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌లో మహారాజ్ పూర్‌లో కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై చిన్న గ్యాస్ సిలిండర్‌ను గుర్తు తెలియని దుండగులు అమర్చి ప్రమాదానికి కుట్ర పన్నారు. తెల్లవారుజామున 5.50 నిమిషాలకు రైలు ట్రాక్‌పై సిలిండర్ ఉండడాన్ని గుర్తించి వెంటనే రైలును నిలిపివేశాడు. లోకో పైలట్ గుర్తించి అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 

కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు గూడ్స్ రైలు లూప్ లైన్ మీదుగా వెళ్తుండగా లోకో పైలట్ గుర్తించి రైలును ఆపడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే లోకో పైలట్ రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం వాటిని తొలగించి రైలును ముందుకు కదిలించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.

 

ప్రయాగ్‌రాజ్ వైపు ప్లాట్ ఫారమ్‌కు 100 మీటర్ల ముందు లూప్ లైన్‌పై ఉంచిన ఖాళీ పెట్రోమాక్స్ సిలిండర్ కనపడడంతో లోకో పైలట్ వెంటనే రైలు ఎమ్ర్జెన్సీ బ్రేక్ వేసి నిలిపివేశాడు. జీఆర్పీ ఇన్‌స్పెక్రట్, ఇతర రైల్వే అధికారులు పరిశీలించి సమీపంలో ఉన్న నివాసాల వద్దకు వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్ఓ అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.

 

కాగా, ఒక రోజుకు ముందు గుజరాత్‌లోని సూరత్ సమీపంలో రైల్వే ట్రాక్‌కు ఉండే ఫిష్ ప్లేట్ విడదీశారు. కోసంబ- కిమ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను కలిపే ఫిష్ ప్లేట్లను తొలగించడంతోపాటు 40 నుంచి 50 బోల్టులను వదులు చేశారు. రెండు ఫిష్ ప్లేట్లను తొలగించి పక్కనే రైలు పట్టాలపై ఉంచారు. లైన్ మెన్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వెంటనే ఇంజినీర్లు, సిబ్బంది మరమ్మతులు చేసి రాకపోకలు జరిగేలా చేశారు.

 

అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రైలు ప్రమాదానికి కుట్ర పన్నారు. ఉత్తరాఖండ్ సరిహద్దుకు సమీపంలో బల్వంత్ ఎన్ క్లేవ్ కాలనీ వద్ద నైనీ జన్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం జరిగేలా ఏకంగా ట్రాక్‌పై 6 మీటర్ల ఇనుప రాడ్ ఉంచారు. అయితే లోకో పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మేరకు ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *