తిరుమల లడ్డూ వివాదం, ఏఆర్ ఫుడ్స్‌కి కేంద్రం నోటీసులు, టీటీడీ ఆస్తులు..

తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగేసింది. ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

 

తిరుమల లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు హిందూ భక్తులు ఆందోళనలు, మరోవైపు న్యాయస్థానంలో పిటిషన్లు, ఇంకో వైపు ఏపీ ప్రభుత్వం విచారణ జరుగుతోంది. పరిస్థితి గమనించిన కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగేసింది.

 

తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడు లోని దిండుక్కల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు నెయ్యి సరఫరా చేసిన నాలుగు కంపెనీల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ముఖ్యంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపిన నెయ్యి కల్తీ అయినట్టు సమాచారం. దీంతో వివరణ కోరుతూ సదరు కంపెనీకి కేంద్ర ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది.

 

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల( ఎఫ్ఎస్ఎస్ఏఐ) శాఖ రియాక్ట్ అయ్యింది. రిపోర్టు వచ్చిన తర్వాత నెయ్యి నాణ్యతను పరీక్షించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

 

పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో మార్కెట్ లో నెయ్యి నాణ్యతను పరీక్షించడంపై మీడియా ప్రశ్నకు ఆ విధంగా రిప్లై ఇచ్చింది. ఆహార నాణ్యత అనేది ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిదిలోనిదని, ఆ విభాగం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. నివేదికలో వెల్లడైన విషయాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.

 

తిరుమల లడ్డూ వ్యవహారంపై దుమారం రేగుతుండగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. టీటీడీకి సంబంధించి 180 ఆస్తులు అమ్మటానికి ప్రయత్నం చేసిందంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఆర్కే సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

టీటీడీలో ఇసాయి లాబీదే ఆధిపత్యమన్నారు సిన్హా. సనాతన ధర్మాన్ని లాబీ అవమానిస్తోందన్నారు. కోవిడ్ సమయంలో టీటీడీ ఆస్తులను విక్రయించడానికి చర్చలు జరిగాయని తాను నిరసన వ్యక్తం చేయడంతో ఆ విషయాన్ని పక్కనపెట్టిందన్నారు. ఆ తర్వాత ఎటువంటి టెండర్లు పిలవకుండా, ఎవరికీ విక్రయించారన్నది స్పష్టమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *