మహారాష్ట్రలో సింధుదుర్గ్‌లో రాజ్‌కోట్ కోటలోని 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం సంచలనంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఈ అంశం రాజకీయ రూపం దాల్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తు్న్నాయి. మహారాష్ట్రలో శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, బీజేపీల మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ప్రతిపక్షంలోని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌ల పార్టీలు అధికార పార్టీలపై విరుచుకుపడుతున్నాయి. మహారాష్ట్రలో 17వ శతాబ్దికి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కొలుస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు సంబంధించిన ఏ అంశమైన చాలా సున్నితమైన విషయంగా ఉంటుంది.
అలాంటి మహారాష్ట్రలో ఎనిమిది నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ విగ్రహం నేలమట్టమయింది. దీంతో అధికార పక్షం ఇరకాటంలో పడింది. ఇప్పటికే సీఎం ఏక్‌నాథ్ షిండే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అవసరమైతే శివాజీ పాదాలకు వందసార్లు నమస్కారం చేయగలనని పేర్కొన్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ వ్యతిరేకతకు అధికార పక్షం భయపడుతున్నది. తాజాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మహారాష్ట్రకు వెళ్లి క్షమాపణలు చెప్పారు.
పాల్‌గడ్‌లోని ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ మాకు కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు. ఆయన మాకు దైవం. నేను ఈ రోజు ఆయన పాదాల వద్ద నా శిరస్సు వంచి మా దేవుడికి క్షమాపణలు చెబుతున్నాను’ అని తెలిపారు. ‘మా విలువలు వేరు. మాకు మా దైవం కంటే ఏదీ గొప్ప కాదు. నేను ఇక్కడ దిగిన క్షణంలోనే మొట్టమొదటగా శివాజీ మహారాజ్‌కు క్షమాపణలు చెప్పాను. ఆయన విగ్రహం కూలిపోవడంతో బాధపడ్డ ప్రతివారికీ నా క్షమాపణలు’ అని మోదీ పేర్కొన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వానికి డ్యామేజీ కంట్రోల్ చేసే పనిలో మోదీ ఉన్నారు. కానీ, అధికార మహాయుత పక్షంలోనే ఈ విషయంపై చీలికలు కనిపిస్తున్నాయి. భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం శివాజీ విగ్రహం కూలిపోవడంపై తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అజిత్ పవార్ స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నమాట తెలిసిందే. బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గం డ్యామేజీ కంట్రోల్ చేయడానికి కంకణం కట్టుకున్నాయి. మోదీ కూడా పాల్‌గడ్‌లో తన కార్యక్రమానికి వచ్చి.. ఈ విషయంపై మాట్లాడారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ అంతుచిక్కకుండా ఉంటాయి. దక్షిణ, ఉత్తర ధ్రువాలుగా ఉన్న పార్టీలు కూడా కలిసి ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేశాయి. మహా అఘాదీ కూటమి రూపంలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు ఏకమయ్యాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే వర్గం బీజేపీతో చేతులు కలపవడంతో మహా అఘాదీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత పార్టీ గుర్తు, పేరుపైనా కోర్టు వరకు వివాదాలు వెళ్లాయి. చివరికి ఉద్ధవ్ ఠాక్రే ఓడిపోవాల్సే వచ్చింది. ఇదే తీరుగా ఎన్సీపీలోనూ చీలిక వచ్చి పార్టీ పేరు కూడా చీలిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఈ చీలికల పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. గెలిస్తే బతికి బట్టకడుతాయి. లేదంటే.. చరిత్రలో కలిసిపోయే అవకాశాలే ఎక్కువ. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపనున్నాయి.