ఉత్తరాఖండ్‌లో హెలికాఫ్టర్ కూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ హెలికాప్టర్.. మరొక దాన్ని తీసుకెళ్లే క్రమంలో కూలిపోయింది. అయితే జనవాసాల మధ్య కాకుండా కొండల్లో కూలిపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌లో యాత్రను కొద్దిరోజుల కిందట నిలిపివేశారు అధికారులు. దీంతో హెలికాప్టర్ ద్వారా టూరిస్టులు అక్కడికి వస్తున్నారు. వారి కోసం క్రెస్టల్ హెలికాఫ్టర్‌ను ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ దెబ్బతింది.
దాన్ని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఆర్మీ ఎంఐ 17 ఛాపర్‌ను తెప్పించి, ప్రత్యేకమైన కేబుళ్లతో దాన్ని మరో ప్రదేశానికి తరలించే ప్రయత్నం చేశారు అధికారులు. ఆదివారం ఉదయం కొద్దిదూరం వెళ్లిన తర్వాత కేదార్‌నాథ్- గచౌర్ మధ్య ఎంఐ హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు తెలిపోయాయి. కొన్నివేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాఫ్టర్ కొండ లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడం వల్ల చాలా ఎత్తు నుండి పడిపోయిందని అంటున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పడలేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. డ్యామేజ్ అయిన హెలికాప్టర్ మే 24న ల్యాండింగ్ అయినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు.