కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు నోటీసులు..?

బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి. బ్యారేజీలకు బుంగలు ఏర్పడ్డాయి. పంప్‌హౌస్‌లు మునిగిపోయాయి. కాళేశ్వరం పేరుతో జరిగిన అతిపెద్ద ప్రాజెక్ట్‌లో అనేక అవకతవకలు జరిగాయి. ఈ లెక్కలన్నీ బయటకు తీసేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఇప్పటికే పలు దఫాలు విచారణ జరిపిన కమిషన్, తాజాగా దూకుడు పెంచింది. త్వరలో కీలక నేతలకు, మాజీ అధికారులకు నోటీసులు అందనున్నట్టు తెలుస్తోంది.

 

మాజీ సీఎస్ తీరుపై అసహనం

 

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చింది కాళేశ్వరం కమిషన్. ఈసారి సీరియస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. విచారణలో దూకుడు పెంచిన కమిషన్, ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించని మాజీ సీఎస్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది. 50కి పైగా అఫిడవిట్లు కమిషన్ ముందుకు వచ్చాయి. వాటిని సమర్పించిన అధికారులను క్రాస్ ఎగ్జామినింగ్ చేయనుంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్టును తామే నిర్మించాం అని చెప్పుకున్న వారిని విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. రెండు రోజుల్లోనే కీలక నేతలకు నోటీసులు వెళ్లనున్నట్టు సమాచారం.

 

కమిషన్ ముందుకు జలవనరుల సంస్థ మాజీ చైర్మన్

 

జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ విరమల్ల ప్రకాష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేశారు ప్రకాష్ రావు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను ఏ పార్టీ తరఫున కమిషన్ ముందుకు హాజరు కాలేదని తెలిపారు. తుమ్ముడిహట్టి నుంచి చూస్తే కాళేశ్వరం అర్థం కాదని, తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్ట్‌లను కేసీఆర్ రీ డిజైన్ చేశారని చెప్పారు. వెధిరే శ్రీరామ్ లాంటి వాళ్ళు కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, కమిషన్‌కు వివరించినట్టు చెప్పారు.

 

కేసీఆర్‌కు నోటీసులు వెళ్లనున్నాయా?

 

ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లోనే ఉండనుంది జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్. వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా మరికొంత మందికి నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఆర్థిక అంశాలతో పాటు, పొలిటికల్ నేతలపై ఫొకస్ చేయనుంది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో వాళ్లకు సమన్లు జారీ చేసే యోచనలో ఉంది కమిషన్. ఈ దఫా విచారణలో ప్రజా ప్రతినిధులు, సబ్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఈక్రమంలోనే కేసీఆర్‌కు నోటీసులు వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *