సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం.. అడ్డుగా వచ్చిన ఎద్దు!

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ రేస్ కోర్స్‌లో నిర్వహించే చీఫ్ మినిస్టర్ ట్రోఫీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం బయలుదేరారు. మార్గమధ్యంలో చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఓ ఎద్దు కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చింది.

ఎదురుగా ఎద్దు రావడాన్ని గమనించిన కాన్వాయ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షణాల్లో బ్రేకులు వేసి వాహనాలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం పరిస్థితిని గమనిస్తూ కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్న ఎద్దును పక్కకు తప్పించారు. కాన్వాయ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముఖ్యమంత్రి వాహన శ్రేణి సురక్షితంగా ముందుకు సాగింది.