విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సముద్ర వాణిజ్య సంబంధాలను ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సముద్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని లోకేష్ తెలిపారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా పోర్టులు, నౌకా నిర్మాణం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నౌకా నిర్మాణం, సముద్ర రంగ అభివృద్ధికి కేంద్రం సుమారు రూ.70 వేల కోట్ల ప్యాకేజీని ఆమోదించిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైం డెవలప్మెంట్ ఫండ్ కూడా ఉందని పేర్కొన్నారు. ప్రతి కొత్త పోర్టు పరిశ్రమలు, వ్యాపారాలు, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు.