దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీ నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ రోజు గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 1,800 పాయింట్లు పడిపోయింది. ఈ పతనంతో పెట్టుబడిదారుల సంపదలో దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
సోమవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ గత ముగింపు 83,919 పాయింట్లతో పోలిస్తే లాభాల్లో 84,421 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కొద్దిసేపటికే 743 పాయింట్లు పెరిగి 84,662 స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ క్రమంగా పతనమైంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 1,800 పాయింట్లు కోల్పోయి 82,862 స్థాయికి దిగజారింది.
మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీ నష్టాలను నమోదు చేసింది. గత ముగింపు 25,800 పాయింట్లతో పోలిస్తే 25,929 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సూచీ తొలుత 25,992 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో పతనమై మధ్యాహ్నం సమయానికి రోజు గరిష్ఠ స్థాయి నుంచి 525 పాయింట్లకు పైగా నష్టపోయి 25,467 వద్ద ట్రేడయింది. మార్కెట్లలో ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.