పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కల్యాణ్ సీరియస్..! విచారణ కమిటీ నివేదికే కీలకం

పోలవరం జనసేన శాసనసభ్యుడు చిర్రి బాలరాజు వ్యవహారశైలిపై పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠిన వైఖరి అవలంబించారు. బాలరాజుపై వరుసగా వస్తున్న ఆరోపణలు, మీడియా కథనాలను తీవ్రంగా పరిగణించిన ఆయన.. వాస్తవాలను తేల్చేందుకు వెంటనే ఓ హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ప్రకటన వెలువడింది.

పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలరాజు తీరుపై కొంతకాలంగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రజలకు పారదర్శకంగా, నీతివంతంగా సేవలందించాలని పవన్ కళ్యాణ్ గతంలోనే ఆయనకు స్పష్టమైన సూచనలు చేశారు. అంతేకాకుండా, స్వయంగా పార్టీ కార్యాలయానికి పిలిపించి పలుమార్లు హెచ్చరికలతో పాటు డెడ్‌లైన్లు కూడా విధించారు. అయినప్పటికీ ఆయన తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో పవన్ తీవ్ర అసంతృప్తి, మనస్తాపం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని హైలెవెల్ కమిటీకి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే చిర్రి బాలరాజుపై తదుపరి క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

అధికారంలోకి వచ్చినా సరే, సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. క్రమశిక్షణ, అవినీతి రహిత పాలన విషయంలో ఎంతటి వారికైనా సరే ఒకే న్యాయమని ఈ చర్యతో పార్టీ శ్రేణులకు గట్టి సందేశం ఇచ్చినట్లయింది.