విశాఖ నేవీపై పాకిస్తాన్ హనీ ట్రాప్ వల..!

తూర్పు తీరంలో భారత నేవీకి విశాఖ అత్యంత కీలక కేంద్రం. ఈస్టర్న్ నావల్ కమాండ్‌తో పాటు యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతుంటాయిక్కడ. దీంతో రక్షణ సమాచారం కోసం శత్రు నిఘా నెట్‌వర్క్‌లు విశాఖపై ఫోకస్‌ పెడుతున్నాయన్న డౌట్స్‌ ఉన్నాయి. 2019లో డాల్ఫిన్స్ నోస్ కేసులో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా నేవీ సిబ్బందిని వలలోకి దింపినట్టు దర్యాప్తులో ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో 15 మంది అరెస్టు కాగా.. 11 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు NIA తెలిపింది.

ఆ తర్వాత కూడా పాక్ లింక్‌డ్ నేవీ గూఢచర్య కేసులు వెలుగులోకి వచ్చాయి. విశాఖ నుంచి కర్వార్ నేవల్ బేస్ వరకు లింకులు ఉన్నట్టు NIA దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా ద్వారా మహిళా ఏజెంట్లుగా పరిచయం పెంచుకుని నేవీ సిబ్బంది నుంచి సమాచారం పొందేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే ప్లాట్‌ఫామ్ మారినా.. టార్గెట్ మాత్రం రక్షణ సమాచారం అనేది క్లియర్.

ఇప్పుడు ఆపరేషన్ ఫైర్‌వాల్‌తో మరో నెట్‌వర్క్ తెరపైకి వచ్చింది. 18 మంది అనుమానితుల్లో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ చెబుతోంది. ప్రదీప్ ముఖర్జీ, అన్నం సాయి వరప్రసాద్ అరెస్టయ్యారు. సోషల్ మీడియా, వాట్సాప్, వాయిస్‌, వీడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని నౌకలు, జలాంతర్గాములు, కదలికలు, ఫొటోలు లాంటి ఇంపార్టెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ను సేకరించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు రాగా.. దర్యాప్తు కంటిన్యూ అవుతోంది.