తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల చట్టం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో 22ఏ అంశంపై సమగ్ర చర్చ జరుగుతుందని ప్రజలు ఆశించినప్పటికీ, ప్రభుత్వ వైఖరి వల్ల అది జరగలేదని విమర్శించారు.
గుడులు, బడులు, దేవస్థానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అప్పట్లో 22ఏ చట్టాన్ని తీసుకొచ్చారని రఘునందన్ రావు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇదే చట్టం పేదలకు ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 22ఏ నిషేధిత భూముల సమస్యపై ప్రభుత్వం తగిన దృష్టి పెట్టాలని కోరారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరైన సన్నద్ధత లేకుండానే అసెంబ్లీకి వచ్చారని రఘునందన్ రావు విమర్శించారు. 22ఏ అంశంపై ప్రజలకు స్పష్టత కల్పించేలా అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.