వరంగల్ జిల్లా పరకాల మండలం మలక్‌పేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి (45) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. మలక్‌పేటలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. కుమారస్వామి భూ యజమాని పిట్ట సమ్మయ్య వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా మంగళవారం ఉదయం పొలంలో మోటార్ వేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనను గమనించిన పిట్ట సమ్మయ్య భార్య గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.