హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మహాగణపతిని దర్శించుకుంటున్నారు. రాత్రి సమయం సమీపించే కొద్దీ క్యూ లైన్లలో రద్దీ పెరుగుతోంది. సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన నాలుగు క్యూ లైన్లతో పాటు వీఐపీ మార్గంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తోపులాటలు జరగకుండా రోప్ పార్టీ సిబ్బంది క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులు క్రమపద్ధతిలో ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఉత్సవాలు పూర్తయ్యే వరకు తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.
భక్తుల భద్రతకు, ముఖ్యంగా మహిళలు, కుటుంబాలతో వచ్చే వారికి పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం షీ టీమ్స్‌ను రంగంలోకి దించారు. రద్దీని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులతో పాటు ఈవ్‌టీజర్లు, జేబుదొంగలు, పిక్‌పాకెటర్లపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటామని పోలీసులు తెలిపారు.