ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వంటి పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అగా ఖాన్ ఫౌండేషన్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని చారిత్రక, వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని పలు చారిత్రక కట్టడాల పరిరక్షణకు ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని సీఎం ప్రస్తావించారు.

ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణలోనూ అగా ఖాన్ ఫౌండేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణ వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.