తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇన్నాళ్లు సహనంగా వహించిన సీఎం విజయ్, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకెను ఏకి పారేశారు. కొందరు మాట్లాడేటప్పుడు రెండు అర్థాలు వచ్చే విధంగా పదాలను ఉపయోగిస్తున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మన ఇళ్లలో తల్లి, అక్కా చెల్లెళ్లు ఉన్నారని, మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణపై వస్తున్న విమర్శలను సీఎం విజయ్ తిప్పికొట్టారు. పోలీస్ వ్యవస్థ కేవలం అరెస్టులు చేయడానికి కాదని, రాష్ట్ర అభివృద్ధికి పునాదన్నారు. చట్టాన్ని పాటించేవారికి మిత్రులు, చట్టాన్ని ఉల్లంఘించేవారికి శత్రువులుగా పోలీసులు ఉంటారన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు.. పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదన్నారు.
ప్రభుత్వం విమర్శలపై దృష్టి పెట్టబోదని, కేవలం అభివృద్ధికి పెద్ద పీటవేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం విజయ్. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు ముఖ్యమంత్రి విజయ్. భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నామో ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, మహిళలను కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
నటి త్రిషను ఉద్దేశించి ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోన్న వేళ, అసెంబ్లీలో పరోక్షంగా బదులిచ్చారు సీఎం విజయ్. కొందరు మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్స్ వచ్చేలా మాట్లాడుతున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని గుర్తు చేశారు. మన ఇళ్లలో తల్లి, అక్కా చెల్లెళ్లు ఉన్నారని, మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఘాటుగా చెప్పుకొచ్చారు.
దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, ఇదే అసెంబ్లీలో జయలలిత ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో మనమంతా చూశామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, మనం మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తుంటారని గుర్తుంచుకోవాలన్నారు. అదే సమయంలో అన్న ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్ అని గుర్తు చేశారు.
అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు సీఎం విజయ్. లాకప్ నేరాలు సాధారణమైనవి కావని, ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్ ద్వారా విచారణ జరిపిస్తామని సభా ముఖంగా హామీ ఇచ్చారు.