సిరిసిల్లలో కౌన్సిలర్ వినూత్న నిరసన.. స్వయంగా మురికి కాలువ శుభ్రం చేసి ప్రశంసలు

సిరిసిల్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా 7వ వార్డు కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం స్వయంగా మురికినీటి కాలువను శుభ్రం చేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే తానే రంగంలోకి దిగినట్లు ఆయన తెలిపారు.

దాదాపు గంటపాటు శ్రమించి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురికినీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో వార్డును పరిశుభ్రంగా ఉంచుతానని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు కౌన్సిలర్ పేర్కొన్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి స్వయంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ఆయనను అభినందిస్తూ, “ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.