Samsung Galaxy Z Fold 8 Ultra వీడియో లీక్.. కనిపించని డిస్‌ప్లే క్రీజ్‌తో ఆకట్టుకున్న ఫోల్డబుల్

సామ్‌సంగ్ తన కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను జూలై 22న జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో Samsung Galaxy Z Fold 8 Ultraకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ ఫోన్ డిస్‌ప్లేలో మడత గీత (Crease) దాదాపు కనిపించకపోవడం టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వీబోలో ‘మొమెంటరీ డిజిటల్’ అనే అకౌంట్ షేర్ చేసిన వీడియోలో Galaxy Z Fold 8 Ultra ప్రోటోటైప్ కనిపించింది. ఫోన్‌ను పూర్తిగా విప్పినప్పుడు స్క్రీన్ మధ్యలో ఉండే మడత గీత దాదాపు కనిపించలేదు. కొన్ని ప్రత్యేక కోణాల్లో మాత్రమే హింజ్ గుర్తు లేదా స్వల్ప గుంత కనిపించినప్పటికీ, గత Galaxy Z Fold మోడళ్లలో కనిపించినట్లుగా స్పష్టమైన క్రీజ్ మాత్రం కనిపించలేదు.

వీడియోలో ఫోన్‌ను పలుమార్లు మడిచి, తిరిగి తెరిచి చూపించారు. దీంతో కొత్త ఫోన్ కావడం వల్ల మాత్రమే క్రీజ్ కనిపించడం లేదనే అనుమానాలకు కూడా కొంతవరకు సమాధానం లభించినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే Galaxy Z Fold 8 Ultra పూర్తి ఫీచర్లు, ధర, ఇతర వివరాలపై సామ్‌సంగ్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.