తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు..! బీజేపీకి అన్నామలై గుడ్ బై..

తమిళనాడులో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవిడ పార్టీల్లో ఊహించని కుదుపు మొదలైంది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ఆ పార్టీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌ అందజేశారు.

 

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు

 

తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మంగళవారం రాజీనామా చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన, మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తో సమావేశమయ్యారు. రాజీనామాకు సంబంధించి ఐదు పేజీల లేఖను చీఫ్ కు అందజేశారు. ఆ సమయంలో ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ అక్కడే ఉన్నారు.

 

తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి, పార్టీ వైఫల్యానికి గల కారణాలను లేఖలో ప్రధానంగా ప్రస్తావించారట అన్నామలై. ఇకపై తన సొంత మార్గాన్ని నిర్దేశించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ నాయకత్వానికి తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైని ఒప్పించేందుకు బీజేపీ నాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది.

 

బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ

 

జాతీయ స్థాయిలో పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపిందట. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పార్టీ విడిచి వెళ్లవద్దని బీజేపీ హైకమాండ్ ఆయనను గతంలో కోరినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. 2020లో బీజేపీలో చేరిన ఆయన.. తక్కువ సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఒకప్పుడు బీజేపీకి అక్కడ ఓట్ల శాతం చాలా తక్కువ.

 

అన్నామలై ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత మాంచి ఊపు వచ్చింది. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ అధిష్ఠానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుండి బయట కనిపించలేదు అన్నామలై.

 

జూన్ నాలుగు అన్నామలై పుట్టినరోజుకు రెండు రోజుకు రెండురోజుల ముందు బీజేపీ చీఫ్‌కు రాజీనామా లేఖను అందజేశారు. తమిళనాడు రాజకీయ వర్గాల సమాచారం మేరకు.. ఆరు నుంచి ఎనిమిది నెలల్లోనే కొత్తగా పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారట అన్నామలై. తమిళనాడులోని బీజేపీ, ద్రవిడ ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

కొత్త పార్టీని నమోదు చేయడం, ఇప్పటికే నమోదైన పార్టీ పేరును పొందడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పార్టీకి ముందు సామాజిక సంస్థ ప్రారంభించాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అన్నామలై కొత్త పార్టీ పెడితే.. వివిధ పార్టీల నుంచి నేతలు ఆయన జతకట్టవచ్చని అంటున్నారు.