ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించేందుకు నీటిపారుదల సలహా మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు అందించేందుకు కాలువలు తెరిచే తేదీలు, నీటి పంపిణీ ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. మే 31వ తేదీ నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు కందుల దుర్గేష్ తెలిపారు. ప్రస్తుతం కాలువల మరమ్మతు పనులు కొనసాగుతున్నందున, పరిస్థితిని బట్టి దశలవారీగా వివిధ కాలువలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతుల కోసం రూ. 148 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే గోదావరి నది కాలుష్య నివారణ కోసం రూ.100 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించినట్లు చెప్పారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తుగా నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు.