తెలంగాణలో ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి సాగు విస్తీర్ణానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన వ్యూహాన్ని సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్ల కాలంలో మొత్తం 2.50 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్, అందులో భాగంగానే తెలంగాణకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున, ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో తగ్గించాలనుకుంటున్న మొత్తం లక్ష్యంలో ఒక్క తెలంగాణ వాటానే దాదాపు 10 శాతంగా ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ఏళ్లుగా వరి ఉత్పత్తి అసాధారణ స్థాయిలో పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో (FCI) నిల్వలకు స్థలం దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. అయితే, దేశీయంగా వరి పంట విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, పామాయిల్ వంటి నిత్యావసర పంటల ఉత్పత్తి ఘోరంగా పడిపోతోంది. ఫలితంగా ఏటా రూ. 1.50 లక్షల కోట్లకు పైగా నిధులను వెచ్చించి ఇతర దేశాల నుండి వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి దేశీయంగా స్వయంసమృద్ధి సాధించాలంటే వరి సాగును తగ్గించి పంట మార్పిడి చేయడం అనివార్యమని కేంద్రం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరి సాగును మానేసి, ఆ స్థానంలో కంది, సోయాబీన్, పెసర, మినుము, జొన్నలు వంటి వాణిజ్య, పప్పుధాన్యాల పంటలను వేసే రైతులకు ఎకరాకు రూ. 10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) అందించే సరికొత్త పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి ఏడాదిలో కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానాన్ని ప్రారంభించి, ఐదేళ్లలో దశలవారీగా పంట మార్పిడి లక్ష్యాన్ని చేరుకోవాలని, తద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రైతులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.