45 ఏళ్ల అజ్ఞాతానికి స్వస్తి: భార్యతో కలిసి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత నరహరి లొంగుబాటు

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), బిహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోష్ (64) తన భార్య, మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్ లతతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. గత 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రనేత లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి, 1982లో విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) ద్వారా ఆకర్షితుడై అడవి బాట పట్టారు. మావోయిస్ట్ పార్టీ టెక్నికల్ విభాగానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఈయన.. తుపాకులు, రాకెట్లు, గ్రెనేడ్ల తయారీతో పాటు ఆధునిక ఆయుధాల మరమ్మతుల్లో అత్యంత నిపుణుడు. అనారోగ్య కారణాలు, అడవుల్లో భద్రతా దళాల ఒత్తిడి పెరగడం, ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కష్టమని గ్రహించడంతోనే ఈ దంపతులు జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు డీజీపీ తెలిపారు.

ప్రభుత్వ పునరావాస విధానంలో భాగంగా లొంగిపోయిన నరహరి దంపతులను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. నరహరిపై ఉన్న రూ. 25 లక్షల రివార్డు మొత్తాన్ని, అలాగే ఆయన భార్య దానమ్మపై ఉన్న రూ. 20 లక్షల రివార్డు మొత్తాన్ని (మొత్తం రూ. 45 లక్షలు) డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన మావోయిస్టులు దాదాపు అందరూ జనజీవన స్రవంతిలోకి వచ్చారని, ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా కేవలం ముగ్గురు మాత్రమే బయట యాక్టివ్‌గా ఉన్నారని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *