దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వీధి కుక్కల దాడుల వ్యవహారంలో భారత సర్వోన్నత న్యాయస్థానం అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. జంతు సంరక్షణ కంటే పౌరుల ప్రాణాల రక్షణే పరమావధి అని చాటిచెబుతూ.. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ప్లేసెస్ (బహిరంగ ప్రదేశాల) నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మార్చడానికి సుప్రీంకోర్టు స్పష్టంగా నిరాకరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. జంతు ప్రేమికులు, ఎన్‌జీఓలు దాఖలు చేసిన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. కుక్కల దాడుల భయం లేకుండా, ప్రశాంతంగా మరియు స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కుక్కలకు స్టెరిలైజేషన్ (సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు), వ్యాక్సినేషన్ చేసిన తర్వాత తిరిగి పాత ప్రాంతాల్లోనే వదిలేయాలన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. వాటిని పట్టుకున్నాక ప్రత్యేక షెల్టర్ హోమ్‌లకే పరిమితం చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో అమాయక చిన్నారులు, వృద్ధులు, పర్యాటకులు వీధి కుక్కల దాడులకు గురై ప్రాణాలు కోల్పోతున్న కఠిన వాస్తవాలను కోర్టు విస్మరించలేదని, చిన్న పిల్లలు కేవలం కుక్కల దయ మీదో, తమ శారీరక బలం మీదో ఆధారపడి బతకాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని న్యాయస్థానం పదునైన వ్యాఖ్యలు చేసింది.
ఈ సంక్షోభం ఇంతలా ముదరడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల నిర్లక్ష్యమే కారణమని సుప్రీంకోర్టు మండిపడింది. వీధి కుక్కల జనాభా నియంత్రణకు (ABC ఫ్రేమ్‌వర్క్) సరైన నిధులు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించింది. ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో కనీసం ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే రేబిస్ సోకిన, తీవ్రంగా గాయపడి కోలుకోలేని స్థితిలో ఉన్న, అత్యంత ప్రమాదకరమైన కుక్కలకు చట్టపరమైన నిబంధనల ప్రకారం “కారుణ్య మరణం” (Euthanasia) ప్రసాదించడానికి కూడా కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కోర్టు ధిక్కారణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. హైకోర్టులు ఈ నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది.