బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర మంత్రి భేటీ..!

2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్తాయి బడ్జెట్‌ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వివిధ రంగాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

 

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో శనివారం భేటీ అయ్యారు. కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టనుంది.

 

ఢిల్లీలోని భారత్ మండపంలో సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో బడ్జెట్ రూపకల్పనపై వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చలు జరిపారు. ఇందులో వార్షిక పద్దుపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.

 

కాసేపట్లో జీఎస్టీ మండలి భేటీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జీఎస్టీ మండలి భేటీ కానుంది. 53వ సమావేశంలో భాగంగా ఆన్ లైన్ గేమింగ్ రంగానికి 28శాతం జీఎస్టీ అమలుపై సమీక్షించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతోపాటు జౌళి, ఎరువులకు ఇన్ వర్టెడ్ సుంకం అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా, చివరిసారి జీఎస్టీ మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న జరగగా.. దాదాపు 8 నెలల తర్వాత తిరిగి సమావేశం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *