రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ..!

తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారీ డీఎంకె అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక అన్నాడీఎంకె మళ్లీ పుంజుకుంటుందా? ఇవే ప్రశ్నలు తమిళ తంబీలను వెంటాడుతున్నాయి.

 

ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది విపక్ష అన్నాడీఎంకె. అంతేకాదు డీఎంకె ఆధిపత్యానికి గండికొట్టాలని ఆలోచన చేస్తోంది. నిన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకె ఒక్కసీటు గెలవ లేదు. అంతేకాదు చాలాచోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచింది ఆ పార్టీ. ఇక ఆ పార్టీ పనైపోయిందని భావిస్తున్న తరుణంలో రంగంలోకి దిగేశారు శశికళ. పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ సంచలన ప్రకటన చేశారు శశికళ. అంతేకాదు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అమ్మ పాలన తీసుకొస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.

 

ప్రతిపక్ష నేత, మాజీ సీఎం పళనిస్వామి వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పించారు శశికళ. ఇకపై తానే అధికార పార్టీని ప్రశ్నిస్తానని, అందుకు తగిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన పని లేదన్నారు. అన్నాడీఎంకె పనైపోయిందని ఎవరూ అధైర్య పడవద్దంటూ కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అంతాబాగానే ఉంది శశికళ రీఎంట్రీని పళనిస్వామి అంగీకరిస్తారా? అన్నదే అసలు ప్రశ్న.

 

అన్నాడీఎంకె పార్టీలో పట్టు సాధించాలని గతంలో ప్రయత్నం చేసి విఫలమయ్యారు శశికళ. మరి ఆమె ఎత్తుగడ వెనుక ఎవరున్నారన్నది అసలు పాయింట్. ఈసారి పార్టీలోకి టీటీవీ దినకరన్, పన్నీరుసెల్వం రావచ్చని అంటున్నారు. అందరూ కలిస్తే డీఎంకెను ఓడించడం సాధ్యమవుతందని ఎవరికివారే వేరు కుంపటి పెట్టుకుంటే సాధ్యంకాదని అంటున్నారు.

 

కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్‌కు మంచి సంబంధాలున్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. అటువైపు నుంచి ఒత్తిడి తెచ్చి పళని స్వామి, పన్నీరుసెల్వం, శశికళ గెలిస్తే సునాయాశంగా గెలువచ్చని అంచనాలు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండేళ్ల మాత్రమే ఉంది. ఈలోగా అక్కడి రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *