రాష్ట్రంలో చికెన్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా చోట్ల కిలో ధర రూ.250 నుంచి రూ.300 దాకా ఉంటోంది. రేట్లు ఇంతలా ఉన్నా పౌల్ట్రీ రైతులకు మాత్రం లాభం రావడం లేదు. బాయిలర్పౌల్ట్రీ ఇండస్ట్రీ వెనుక పెద్ద మాఫియా ఉందని, అందుకే తమ కష్టానికి తగిన ఫలితం రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కిలో బర్డ్ రేట్ రూ.180 దాకా ఉంటోందని, కానీ వ్యాపారులు, దళారులు మాత్రం తమకు రూ.120 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోతున్నారు. కోడి పిల్లలకు, దాణాకు లక్షల్లో పెట్టుబడి పెట్టి, 45 రోజులు కష్టపడి పెంచిన తమకు ఎంత చేతికి వస్తుందో, దాదాపు అంతే మొత్తం మీడియేటర్లకు దక్కుతోందని చెబుతున్నారు. ఇచ్చినంత తీసుకోవడమే తప్ప ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాఫియా గత 45 రోజుల్లో కోడిపిల్లల రేట్లను 60 శాతం, దాణా రేట్లను 25 శాతం పెంచిందని చెబుతున్నారు. మరోవైపు ఇంటిగ్రేషన్సిస్టమ్పేరుతో పౌల్ట్రీరంగాన్ని కార్పొరేటైజ్ చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారు. ఇప్పటికే 70 శాతం రైతులు ఈ సిస్టమ్ కిందికి వచ్చారని, మిగిలిన రైతులను కూడా దారిలోకి తెచ్చుకునేందుకు ఇలా చికెన్ రేట్లను అమాంతం పెంచడం, తగ్గించడం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశంలో వెన్కాబ్అనే సంస్థ వివిధ కంపెనీలకు బాయిలర్ కోడిపిల్లల బ్రీడ్ సప్లై చేస్తోంది. ఆయా కంపెనీలు కోడి పిల్లలను తయారు చేసి విక్రయిస్తుంటాయి. వెన్కాబ్ప్రతి రోజూ కోడిపిల్లలు, బర్డ్, చికెన్ రేట్లను ఫిక్స్చేసి ప్రకటన ఇస్తుంది. అప్పుడే పుట్టిన కోడి పిల్ల రేటు రూ.35 కాగా, దాన్ని కంపెనీలు సిండికేట్గా మారి ఈ మధ్యే రూ.56 చేశాయి. అంటే 60 శాతం పెంచాయి. దాణాలోనూ ఇదే తరహా మాఫియా ఉంది. 50 కిలోల దాణా 40 రోజుల క్రితం వరకు రూ.1,550 ఉండగా.. 25 శాతం పెంచి రూ.1,950 చేశాయి. ఒక్కో పిల్లను రూ.56తో కొంటే అది 2 కిలోలకు ఎదగడానికి 3.5 కిలోల (రూ.136 విలువైన) దాణా తింటుంది. కోడి 2 కిలోలకు పెరిగితే రైతుకు రూ.240 వస్తాయి. కోడిపిల్ల, దాణాకు అయిన రూ.192 తీసేస్తే ప్రతి కోడిపై రూ.48 మాత్రమే మిగులుతాయి. కోడి కిలోన్నర తూగితే ఆ మొత్తం కూడా రావు. ఇక వచ్చిన రూ.48 నుంచి కరెంటు, నీళ్లు, కూలీలు, ఇతరత్రా ఖర్చులు తీసేస్తే తమకు రెక్కల కష్టం కూడా మిగలడం లేదని, కానీ ట్రేడర్లు మాత్రం ఏ రిస్కు లేకుండా ప్రతి కిలో కోడిపై రూ.60 నుంచి రూ.80 వరకు లాభాలు పొందుతున్నారని రైతులు అంటున్నారు. ట్రేడర్స్చెప్పిందే ధర ఓ రైతు రూ.56 చొప్పున 10 వేల కోడి పిల్లలను కొని బర్డ్స్షెడ్లో పెంచితే.. ఎండ, జన్యుపరమైన లోపాలతో కనీసం 10 శాతం చొప్పున వెయ్యి దాకా చనిపోతాయి. మిగిలిన వాటిని పెంచి పెద్ద చేయాలంటే సవాలక్ష సమస్యలు. అన్నిటికంటే కీలకమైనది 36, 42 రోజుల మధ్య ట్రేడర్స్ను పట్టుకోవడం. ఆ గడువులోగా ట్రేడర్స్దొరక్కపోతే కోళ్లు దాణా ఎక్కువ తింటాయి. రైతులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీనిని అదనుగా తీసుకున్న ట్రేడర్లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కై బర్డ్స్రేటు తగ్గిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వెన్కాబ్ కిలో కోడి ధరను రూ.140 అని ఫిక్స్ చేసింది. కానీ ట్రేడర్స్ మాత్రం ‘సప్లై ఎక్కువ ఉంది.. డిమాండ్ తగ్గింది’ అంటూ రూ.120కే కొంటున్నారు. పౌల్ర్టీ రైతు మరో ట్రేడర్ ను అడిగినా అదే మాట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రేడర్లకు రూ.120కే విక్రయిస్తున్నారు. ఇలా 45 రోజుల రైతుల కష్టం ట్రేడర్లకు గంటల వ్యవధిలో డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది. 70% మంది ఇంటిగ్రేషన్ సిస్టమ్లోకి ట్రేడర్లు, కంపెనీల మాయాజాలం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం మంది రైతులు ఇంటిగ్రేషన్ సిస్టమ్లోకి వెళ్లిపోయారు. అంటే చికెన్ విక్రయించే కంపెనీలకు రైతులు వారి షెడ్లను లీజుకు ఇచ్చి కూలీలుగా మారుతున్నారు. కంపెనీలు సప్లై చేసే కోడిపిల్లలు, దాణా ఆధారంగా.. వాటిని పెంచి వాళ్లకే ఇచ్చి కూలి తీసుకుంటున్నారు. ఇందుకోసం కంపెనీలు రైతులకు కిలోకు రూ.5 నుంచి రూ.6 చొప్పున చెల్లిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మిగిలిన 30 శాతం మంది రైతులు కూడా క్రమంగా ఇంటిగ్రేషన్ సిస్టమ్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే కంపెనీలన్నీ సిండికేట్గా మారి చికెన్ ధరలను తమ కంట్రోల్లోకి తెచ్చకుంటాయి.