రన్వేపై జారిపోయిన విమానం

రన్వేపై జారిపోయిన విమానం

కాట్మండ్‌ : నేపాల్‌ రాజధాని కాట్మండ్‌లోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు శుక్రవారం మూసివేశారు. 139 ప్రయాణికులతో టేక్‌ఆఫ్‌ అవుతున్న ఓ మలేషియన్‌ జెట్‌ రన్‌వేపై జారీపోవడంతో, విమానాశ్రయాన్ని మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవరూ గాయపడలేదని పేర్కొన్నారు. కాట్మండ్‌లో ల్యాండ్‌ అయ్యేందుకు వచ్చిన విమానాలను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. రన్‌వేపై జారీపోయిన మలేషియన్‌కు చెందిన ఈ విమానం మలిండో ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌-737 అని అన్నారు. రన్‌వేకు 30 మీటర్ల దూరంలో మట్టిలో ఈ విమానం కూరుకుపోయింది. 
విమానంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్‌పోర్ట్‌ అధికార ప్రతినిధి ప్రేమ్‌ నాథ్‌ థాకూర్‌ చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తె లియరాలేదు. మట్టిలో కూరుకుపోయిన ఆ విమానాన్ని బయటికి తీసినట్టు థాకూర్‌ తెలిపారు. అమెరికా-బంగ్లా ఎయిర్‌వేస్‌కు చెందిన డీహెచ్‌సీ-8-400 విమానం గతనెల12న కాట్మండ్‌ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు మృతి చెందారు.20 మంది గాయపడ్డారు.

2015, మార్చి4న టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ జెట్‌ కూడా ల్యాండ్‌ అయ్యేటప్పుడు జారీపోవడంతో, ట్రిభువన్‌ ఎయిర్‌పోర్ట్‌ను నాలుగు రోజులపాటు మూసివేశారు. నేపాల్‌లో ఎయిర్‌ సేఫ్టీలో అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పలు విమాన ప్రమాదాలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కారణంతో యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌స్పేస్‌లో నేపాల్‌కు చెందిన ఎయిర్‌లైన్స్‌ ఎగరడానికి వీలులేకుండా నిషేధం విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *