అమరావతి: బ్యాంకులపై ప్రజలకు భరోసా లేదని దీనికి కేంద్ర ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర ఆర్థికవ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాల అమలులో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవైందని ఆరోపించారు. నేడు ఆయన గుంటూరు అర్బన్ బ్యాంకులో నూతన అదనపు భవనాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ ఏటిఎంల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారని,నగదు లభ్యత కష్టతరంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో కుంభకోణాలు రోజురోజుకు పెరిగిపోవడం వల్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రయోజనాలు తుంగలో తొక్కి తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని చెప్పారు. అమెరికా తరహాలో రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని యనమల చెప్పారు.