మెట్రో స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ ..
హైదరాబాద్, కేపీహెచ్‌బీకాలనీ: మీ ఇష్టం వచ్చినట్లు చలాన్లు రాస్తామంటే చూస్తూ ఊరుకోం.. వ్యాపారస్తులను వదిలేసి మాపైనేనా మీ ప్రతాపం అంటూ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంపై వాహనదారులు మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జేఎన్‌టీ యూ మెట్రోస్టేషన్‌కు ఇరువైపులా టూ, త్రీ, ఫోర్ వీలర్స్ పార్కింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేసినా ఇంతవరకు అక్కడ పేయిడ్ పార్కింగ్ మొదలు కాలేదు. దీంతో వాహనదారులు తమ వాహనాలను ఉచితంగానే పార్కింగ్ చేసుకుంటూ తమ పనులను ముగించుకున్న తర్వాత వాహనాలను తీసుకెళ్తున్నారు. సర్దార్‌పటేల్‌నగర్ వైపు ఉన్న పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన ద్విచక్ర వాహనాలను కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించారు. అడ్డం వచ్చిన వాహనదారులకు చలాన్ రాసేసి చేతిలో పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో పార్కింగ్ సౌకర్యం లేకున్నా వారిని వదిలేసి ఫ్రీపార్కింగ్ ఉందని ఇక్కడ పార్కింగ్ చేస్తే పోలీసుల పెత్తనం ఏంటని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహంపై వాహనదారులు మండిపడడంతో ఇక్కడ పార్కింగ్ చేస్తే సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలకు సర్వీసు ఇవ్వాలని అనుకుంటే నో పార్కింగ్ బోర్డులు పెట్టవచ్చు కదా అని వాహనదారులు ఎదురు ప్రశ్నించారు. చివరకు పోలీసుల తో గొడవపడి కూడా టైం వృథా అవుతుందని ఛలాన్లు తీసుకోని వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల తీరు వాహనదారులకు ఆగ్రహం తెప్పించడంతో పాటు పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు సైతం విస్తుపోయారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను అనుగుణంగా చలాన్లు రాస్తే బాగుం టుందని వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.