ఏపీని అంతర్జాతీయ సముద్ర వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పరిశ్రమలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా (ఆసియాన్) దేశాలతో బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రం భావిస్తోందన్నారు. సముద్ర అనుసంధానం, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారానికి ఏపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సముద్ర వాణిజ్య సంబంధాలను ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమల ద్వారా మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సముద్ర ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని లోకేష్ తెలిపారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా పోర్టులు, నౌకా నిర్మాణం, సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. నౌకా నిర్మాణం, సముద్ర రంగ అభివృద్ధికి కేంద్రం సుమారు రూ.70 వేల కోట్ల ప్యాకేజీని ఆమోదించిందని, ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైం డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉందని పేర్కొన్నారు. ప్రతి కొత్త పోర్టు పరిశ్రమలు, వ్యాపారాలు, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వెల్లడించారు.