నాటి రాజుల కాలం నుంచి నేటి వరకు తెలుగువారిని అలరిస్తున్న ఓ ప్రత్యేకమైన క్రీడ.. కోడి పందెం. ఈ కోడి కత్తి పదునుకు.. పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. ఎందరో రాజుల తలలు రణభూమిలో ఒరిగాయి. ఎందరో పాలకులు ఏకంగా రాజ్యాలనే పోగొట్టుకున్నారు. అప్పట్లో పల్నాడు కేంద్రంగా పేరుగాంచిన ఈ కోడిపందెం.. క్రమంగా కృష్ణా తీరం నుంచి గోదావరి తీరానికి చేరి.. ప్రపంచఖ్యాతి గాంచింది. చరిత్రలో గొప్ప స్థానమున్న కోడిపందాల మీద ఆధునిక కాలంలో బెట్టింగ్ సాగుతోందనే విమర్శ ఉన్నా.. ఏడాదికోసారి వచ్చే పెద్ద పండుగలో ఆ మాత్రం ఉత్సాహం లేకపోతే ఎలా? అనేవారే ఎక్కువ.
పౌరుషానికీ, రాజసానికీ పెట్టింది పేరు.. పందెం కోళ్లు. ఒకసారి బరిలో దిగాయంటే తల తెగి వేళ్లాడుతున్నా.. అవతలి పుంజు మీద ఎగబడుతూనే ఉంటాయి తప్ప వెనక్కి మాత్రం రావు. ఈ ప్రత్యేక లక్షణమే పందేలకు పురిగొల్పేలా చేస్తోంది. చరిత్రలో ఈ కోడి పందేనికి వేలాది ఏళ్ల చరిత్ర ఉంది.
చరిత్ర
6000 ఏళ్ల నాటికే పర్షియాలో కోడి పందాలు ఆడేవారని చరిత్రను బట్టి తెలుస్తోంది.
గ్రీస్‌లో యుద్ధానికి ముందు శత్రువుల పేర్లను కోళ్లకు పెట్టి పందేలు కాసేవాళ్లు. తమ పుంజు గెలిస్తే.. యుద్ధం గెలిచినట్లు భావించేవారు.
సిరియా రాజులూ రణభూమికి తరలిపోయే ముందు కోడిపందెం వేసి, తమ పుంజు గెలిస్తే ఖుష్ అవటమే కాదు.. దానికి యోధుడిలా భావించి పూజలూ చేసేవారు.
11వ శతాబ్దంలో పల్నాడులో బ్రహ్మనాయుడికి, నాగమ్మకు మధ్య జరిగిన కోడిపందెంలో బ్రహ్మనాయుడి ఓటమి.. వనవాసానికి దారితీసిన సంగతి తెలిసిందే.
బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు జోరుగా సాగాయని, అవి వైరానికీ దారితీశాయని చరిత్ర చెబుతోంది.
సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లోనూ కోడి పందేల గురించి విపులంగా రాశారు.
1646 లో జార్జి విల్సన్ అనే ఓ ఆంగ్ల రచయిత ‘కాక్ ఆఫ్ ది గేమ్’ అనే పేరుతో కోడి పందెం గురించి ఏకంగా ఓ పుస్తకమే రాశాడు.
ఇరాన్ , ఇండోనేషియా , బ్రెజిల్ , పెరు , ఫిలపైన్స్ , మెక్సికో , ఫ్రాన్స్ , క్యూబా , పాకిస్తాన్ , అమెరికా , జపాన్ దేశాల్లోనూ కోడి పందేల ఆచారం ఉంది.
బ్యాంకాక్ ప్రభుత్వం పందెంరాయుళ్లను ప్రోత్సహిస్తూ.. ఏకంగా స్టేడియాలనే నిర్మించింది.
కుక్కుట శాస్త్రం
మనుషుల చేతి గీతలు చూసి జాతకం చెప్పినట్లుగా.. థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌లలో కోడి కాళ్ల రేఖలను చూసి జాతకం చెబుతారు. ఇక్కడ ఈ కోడి జ్యోతిష్కులకు పిచ్చి గిరాకీ. కోడి కాలిరేఖలను బాగా పరిశీలించి చెప్పే క్రమంలో కోడి.. తల్లి, తండ్రుల చరిత్రనూ వీళ్లు ఆరా తీస్తారు. మన వర్సిటీల్లో జోతిషం కోర్సులున్నట్లుగా అక్కడ కోడి జాతకం చెప్పే ప్రైవేటు జాతక కేంద్రాలున్నాయి. పందెం రాయుళ్లు జాతకం చూపించకుండా బరిలోకి కోడిని దింపనే దింపరు. ‘జాతకం బాలేదోయ్’ అని ఆ జ్యోతిష్కుడు అంటే ఇక ఆ రోజుకు బరి ముఖం చూడరు. ఈ కోళ్ల జాతకాలు చెప్పేవారిలో ఏడాదికి 10 లక్షల రూపాయలు సంపాదించేవారు వేలల్లో ఉన్నారంటే నమ్మలేం.
ఇక.. మన దగ్గర కూడా కుక్కుట శాస్త్రం పుస్తకం రూపంలో లేకపోయినా.. అనాదిగా పెద్దల నుంచి తర్వాతి తరానికి మౌఖికంగా అందుతూ వచ్చింది. ఏ సమయంలో.. ఏ నక్షత్రంలో.. ఏ పుంజు పొడుస్తుంది? యజమాని పేరులోని తొలి అక్షరం ఏమిటి? పందేలు జరిగే ప్రదేశం, కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం, పందెం రోజు జరిగే నక్షత్రం, శుక్లపక్షంలో పందేనికి ఏ పుంజును బరిలో దించాలి? ఏ దిశగా పుంజు యజమాని.. తన పుంజును బరిలో దించాలి? వంటివి నేటికీ గోదావరి తీరంలోని ముందుతరాల పెద్దలు చెబుతూ ఉంటారు.
బరిలో దించే కోళ్లలో వాటి రంగు, స్వభావం, రూపురేఖలు, పోరాట శక్తిని బట్టి 50కి పైగా రకాలున్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నల్ల సవల,రసంగి , కౌజు , మైల , చవల , సేతువ , కొక్కిరాయి , పచ్చకాకి , ఎరుపుగౌడు , తెలుపుగౌడు.. ఇలా పలు పేర్లతో వీటిని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఈ పేర్లలో మార్పులున్నాయి. ఇన్ని రకాల పుంజుల్లోనూ.. కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
పందెం రాయుళ్లు.. పుంజులను తమ బిడ్డల్లా చూసుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోసమే వీటిని పెంచే ఫామ్‌లూ ఉన్నాయి. ఇక.. పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణతో బాటు ఎప్పుటికప్పడు పశువైద్యులకు చూపించి, వాక్సిన్లు కూడా వేయిస్తారు. ‘సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనక వర్షమే’ అనే సామెత కూడా గోదావరి తీరాన ప్రాచుర్యంలో ఉంది. సంక్రాంతి బరిలోకి దించాలనుకునే పుంజులకు జీడిపప్పు , పిస్తా , బాదం వంటివి తినిపిస్తారు. ఈ బలమైన ఆహారం వల్ల బరిలో కోడికి గాయమైనా వెంటనే రక్తం కారదట. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు ఇక్కడ కోడిపందాల సందడి కొనసాగుతుంది.
ఈ సంక్రాంతి మూడు రోజులు యువత నుండి వృద్ధుల వరకు పందేలను చూసేందుకు ఎగబడతారు. ఈ పందేలలో డబ్బులు గెలిచిన వారు సంక్రాంతి జోష్‌గా వేడుకలు చేసుకుంటే ఓడినవారు అప్పు చేసి మద్యం త్రాగి ఇంట్లో జోగుతారు. ఇంత నష్టం, ఇంత హింసతో పండగ చేసుకోవాలా? జంతు ప్రేమికులు గొణుక్కుంటున్నా.. ‘ఇది మా ప్రైడ్’ అని యువత చెప్పుకొస్తోంది.