లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు..

లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన పర్యటనతో ఈ దీవుల పేరు ఇప్పుడు మార్మోగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల చూపు వీటిపై పడింది. ఈ దీవుల కోసం ఇంటర్ నెట్ లో తెగ వెతికేస్తున్నారు. అటు కేంద్రం ప్రభుత్వం కూడా లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడేలా మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

 

ఫైటర్‌ జెట్‌లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ద్వంద్వ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేంద్రం కొత్తగా ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది. మినికోయ్‌ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

 

వాస్తవానికి మినికోయ్‌ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్న వేళా.. ఈ ప్రాంతంపై దృష్టి కేంద్రీకిరించాలని కోస్ట్ గార్డ్ గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

 

అయితే, కేంద్రం తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని యోచిస్తోంది. ప్రస్తుతం లక్షద్వీప్‌లో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. 1987-88లో అగత్తి దీవుల్లో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *