పాకిస్తాన్ మరోసారి సింధు జలాల ఒప్పందంపై స్పందించింది. ఆ దేశ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్.. ఇండస్ వాటర్ ట్రీటీ, దక్షిణాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. సింధు నది నీటిని భారత్ నిలిపివేస్తే తమ దేశానికి వ్యతిరేకంగా నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ నదీతీర దేశం కావడంతో అక్కడి నుంచి ప్రవహించే నదులు పాకిస్తాన్‌లోకి వస్తాయని, ఈ భౌగోళిక పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడానికి ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నంతకాలం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ఏకపక్ష చర్యగా అభివర్ణిస్తోంది.
పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సింధు నది, దాని ఉపనదులు అత్యంత కీలకమైనవి. ఈ నదుల నీటి ప్రవాహంపై ప్రభావం పడితే దేశంలో తీవ్ర నీటి కొరత, వ్యవసాయ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని పాకిస్తాన్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.