ఓటర్ల జాబితాను పరిశీలించుకోండి.. ప్రత్యేక ప్రచార దినాలపై కలెక్టర్ కీలక ప్రకటన

అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision of Photo Electoral Rolls–2026) ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించేందుకు జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, వెలగపూడి, అమరావతి జారీ చేసిన ఆదేశాల మేరకు ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (BLOలు), రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించడంతో పాటు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించేందుకు BLOలు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.