మత్తు పదార్థాల నిర్మూలనతోనే ఆరోగ్యకర సమాజం: సరిత రెడ్డి

కల్వకుర్తి, ఆగస్టు 22: మత్తు పదార్థాల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన సమాజానికి బాటలు పడతాయని అంగన్వాడీ చెర్కూర్ సెక్టార్ పర్యవేక్షకురాలు సరిత రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం బొల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నషాముక్త్ భారత్ అభియాన్ ‘వికసిత్ భారత్‌కి పహచాన్’ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించిన సరిత రెడ్డి.. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు చంద్రమోహన్ రావు, లలిత, పద్మ, చెన్నకేశవులు, రాజేందర్‌తో పాటు సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు.