ఢిల్లీలో జరిగిన ఓ టెక్కీ మృతి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం చివరకు భర్త ప్రాణాలు తీసిన ఘటనకు దారితీసింది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినయ్ గుప్తా తన సొంత అత్తమామల కుటుంబ సభ్యుల దాడిలో మృతి చెందినట్లు సమాచారం. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చిన్నారికి మందులు ఇచ్చే విషయంలో వినయ్‌కు భార్య రేఖతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ అనంతరం రేఖ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సుమారు 10 నిమిషాల తర్వాత రేఖ తన ఇద్దరు సోదరులు, వదిన, తండ్రి, మేనమామతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం.
దాడి సమయంలో వినయ్ తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. రేఖ కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో వినయ్ తల్లి వారికి నీరు, ఇతర ఏర్పాట్లు చేసేందుకు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె తిరిగి వచ్చేసరికి వినయ్‌పై కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని గుర్తించారు. అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ దాడి ఆగలేదని సమాచారం. తీవ్రంగా గాయపడిన వినయ్ మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.