ఆదిలాబాద్‌లో ఉగ్రరూపం దాల్చిన పెనుగంగ.. వంతెన పిల్లర్ల పైభాగానికి చేరిన వరద నీరు

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెనుగంగ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బోరజ్ మండలం డోల్లారా వద్ద నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

వరద ఉద్ధృతి కారణంగా డోల్లారా వద్ద ఉన్న సరిహద్దు వంతెన పిల్లర్ల పైభాగం వరకు నీరు చేరింది. నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పెనుగంగ నది ప్రవాహ ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్ప నది పరిసరాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వాగులు, నదులు దాటే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అధికారులు కోరారు.