నల్లమలలో అనుమానాస్పదంగా పెద్దపులి మృతి.. అంతర్జాతీయ టైగర్ దినోత్సవాన విషాదం

ప్రపంచ దేశాలు అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవాన్ని జరుపుకుంటూ పులుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ, నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నాగలూటి–ఆత్మకూరు రేంజ్‌ల సరిహద్దులోని ఇసుకగుండం ప్రాంతంలో టైగర్ ట్రాకర్లు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పెద్దపులి కళేబరం కనిపించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పెద్దపులి మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది సహజ మరణమా, లేక వేరే కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు.