చెయ్యేరు ఇసుక దోపిడీపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం.. ప్రజల జీవనాధారంపై దాడి అని విమర్శ

రాయచోటి–రాజంపేట ప్రాంతంలోని చెయ్యేరు నది పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇది కేవలం సహజ వనరుల దోపిడీ మాత్రమే కాదని, స్థానిక ప్రజల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణంతో పాటు భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన ఆరోపించారు.

కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను సైతం దెబ్బతీసేలా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని చెయ్యేరు నది పరీవాహక ప్రాంతాన్ని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సహజ వనరులను కాపాడడంతో పాటు ప్రజల తాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.