ములుగులో ఉద్ధృతంగా గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం

ములుగు జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరు నాగారం, మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద గంట గంటకూ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన ఉన్న మేడిగడ్డ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో గోదావరి ప్రవాహం మరింత పెరుగుతోంది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద నీటిమట్టం 16.2 మీటర్లకు చేరుకోవడంతో ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద అధికారులు 59 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 11.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 11.84 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. రామన్నగూడెం వద్ద నీటిమట్టం 17.32 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

గోదావరి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.