హాలీవుడ్ యువ నటి కేలీ హాటిల్ (Kaylee Hottle) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 18 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. మేరీల్యాండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేలీని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, అతివేగం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
2021లో విడుదలైన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రంలో జియా పాత్రతో కేలీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. చెవిటి బాలికగా ఆమె చేసిన నటన, కాంగ్‌తో అమెరికన్ సైన్ లాంగ్వేజ్ (ASL) ద్వారా భావోద్వేగాలను వ్యక్తం చేసిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రంలోనూ అదే పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు.
జార్జియాలో జన్మించిన కేలీ బహుళ తరాలుగా వినికిడి సమస్య ఉన్న కుటుంబానికి చెందినవారు. చిన్న వయసులోనే హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సహనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ, ఆమె ప్రతిభను చిరకాలం గుర్తుంచుకుంటామని భావోద్వేగ సందేశాలు పంచుకుంటున్నారు.