ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక.. హార్ముజ్‌లో దాడి చేస్తే తీవ్ర ప్రతీకారం తప్పదన్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య లేదా సైనిక నౌకలపై ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, ప్రతిసారీ ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో నౌకలపై దాడులు జరిగితే, అవసరమైతే టెహ్రాన్ సమీపంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు కూడా అమెరికా లక్ష్యాలుగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, అమెరికా గత 11 రోజులుగా ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సుమారు 75 నిమిషాల పాటు దాడులు నిర్వహించి, ఇరాన్‌కు చెందిన సైనిక కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ చర్యల ఉద్దేశమని అమెరికా పేర్కొంది.

అమెరికా ఆరోపణల ప్రకారం, గత మూడు నెలల్లో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించిన 30కిపైగా వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతుండగా, అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.