రాజోలులో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు తాటాకిల్లు దగ్ధం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం తెల్లవారుజాము నుంచి రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతం కావడంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రాజోలు మండలం శివకోటి గ్రామంలో శనివారం ఉదయం పిడుగుపాటుకు చిట్టూరి శ్రీనివాస్‌కు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పిడుగుపాటుతో ఇంట్లో మంటలు చెలరేగిన కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. భారీ వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.