మేడ్చల్‌లో నిబంధనలు పాటించకుండా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన రెండు ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. చిన్న, సాక్షి ఆసుపత్రులను అధికారులు సీజ్ చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు పరిశీలించారు. మేడ్చల్‌లోని స్వరూప నర్సింగ్ హోమ్‌లోనూ తనిఖీలు చేపట్టి, సంబంధిత డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించిన అనుమతులు, నిబంధనలపై అధికారులు వివరాలు సేకరించారు.
అనుమతులు లేకుండా ఆసుపత్రులను నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, నిబంధనలకు అనుగుణమైన వైద్య సేవలు అందేలా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.