గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్లో తన కెరీర్ సమయంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా వెల్లడించారు. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమను విడిచి హాలీవుడ్‌కు వెళ్లిన కారణాలపై స్పందిస్తూ, తనకు నచ్చని వ్యక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా మారకపోవడం వల్ల కొన్ని సినిమా అవకాశాలు కోల్పోయానని చెప్పారు. ఇతరులు చేసినట్లుగా రాజీ పడకుండా, తన ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇచ్చానని ప్రియాంక పేర్కొన్నారు.
కొంతమంది అగ్ర హీరోలు ఉద్దేశపూర్వకంగా తనను కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పించారని కూడా ఆమె ఆరోపించారు. 2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, మరో సినిమా హీరో షూటింగ్ సెట్‌కు వచ్చి, ఆ పాత్ర మొదట మరో హీరోయిన్ కోసం అనుకున్నారని, పొరపాటున తనకు వచ్చిందని చెప్పడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు. ఆ మాటలు తనకు తీవ్ర నిరాశ కలిగించాయని తెలిపారు.
ఇలాంటి అనుభవాలు ఒక్కసారి మాత్రమే కాకుండా పలుమార్లు ఎదురయ్యాయని ప్రియాంక చెప్పారు. అయినప్పటికీ తన నటన, కష్టపడి పనిచేసే తత్వమే తనను ముందుకు నడిపించాయని, అదే తనకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు విస్తృతంగా స్పందిస్తున్నారు.