సూళ్లూరుపేటలో హైవే పక్కన వ్యర్థాల నిల్వ.. ఎంపీడీవో ఆకస్మిక తనిఖీలు

సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని ప్రసిద్ధ లతికా రెస్టారెంట్ సమీపంలో, జాతీయ రహదారి మరియు కళంగి నది వడ్డున ఉన్న కోటపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న వ్యర్థాల నిల్వపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై. వెంకటేశ్వర రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నెలకొన్న దుస్థితిని పరిశీలించిన ఎంపీడీవో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని కొందరు బాధ్యతారహిత దుకాణాదారులు తమ వ్యాపార సంస్థల చెత్తాచెదారంతో పాటు మృత కళేబరాలను కూడా ఇష్టానుసారంగా అక్కడ పడేస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

దీంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసన వ్యాపించి, స్థానిక ప్రజలు మరియు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యర్థాల సమస్యను వెంటనే పరిష్కరించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.