డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), కాయర్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ‘కొబ్బరి నార (కాయర్) వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రదర్శన’ సదస్సు శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది.
జూలై 16, 17 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాయర్ పరిశ్రమల్లో ఉన్న ఉపాధి, వ్యాపార అవకాశాలపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు.
సదస్సులో కాయర్ పరిశ్రమల స్థాపన, ఆధునిక యంత్రాల వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, రుణ సదుపాయాలపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక యువత, రైతులు స్వయం ఉపాధి అవకాశాలపై మరింత అవగాహన పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.