మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు

మూత్రంలో రక్తం కనిపిస్తే చాలామంది దాన్ని సాధారణ ఇన్ఫెక్షన్ లేదా చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే వైద్యుల ప్రకారం, ఈ పరిస్థితిని హేమటూరియా (Hematuria) అని పిలుస్తారు. ఇది కిడ్నీలో రాళ్లు లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది కిడ్నీ క్యాన్సర్‌కు తొలి హెచ్చరిక సంకేతంగా కూడా ఉండే అవకాశం ఉంది.

కిడ్నీ క్యాన్సర్ ప్రారంభ దశలో సాధారణంగా నొప్పి ఉండదు. దీంతో మూత్రంలో రక్తం కనిపించడం చాలా మందిలో తొలి లక్షణంగా ఉండొచ్చు. కిడ్నీలో ఏర్పడిన క్యాన్సర్ గడ్డలు రక్తనాళాలపై ఒత్తిడి పెంచడం వల్ల మూత్రంతో పాటు రక్తం బయటకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మూత్రంలో రక్తం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, అనుకోకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తిస్తే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.