రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి.. అధికారులకు జాయింట్ కలెక్టర్ వైశాలి ఆదేశాలు

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్‌పేట రైతు భరోసా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తనిఖీలో భాగంగా రైతు భరోసా కేంద్రంలో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, సంబంధిత రికార్డులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రైతులకు యూరియా బస్తాల పంపిణీ విధానాన్ని స్వయంగా పర్యవేక్షించి, ఎలాంటి అవకతవకలు లేకుండా పంపిణీ జరుగుతున్నదీ తెలుసుకున్నారు.

రైతులకు ఎరువులు అందించే ప్రక్రియ, అమలులో ఉన్న నిబంధనలపై ఆర్బీకే సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్న జాయింట్ కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.