అన్నమయ్య జిల్లా కుప్పం సమీపంలోని గుడిపల్లి మండలం మల్లప్ప కొండపై ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్రంలోని శూలగిరికి చెందిన రమేష్ తన భార్య, బిడ్డతో కలిసి స్వామి దర్శనం కోసం వచ్చాడు. అయితే తిరుగు ప్రయాణంలో రమేష్ మృతదేహం లభించగా, అతని భార్య, బిడ్డ కనిపించకపోవడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
రమేష్ కుటుంబం ఒకే ద్విచక్రవాహనంపై ఆలయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఘటన అనంతరం భార్య, బిడ్డ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో రమేష్ భార్య మరో ఇద్దరు యువకులతో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రమేష్ హత్యకు అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. మిస్టరీగా మారిన ఈ హత్య కేసును అన్ని కోణాల్లో కుప్పం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.