నిడమర్రులో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ.. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు

ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల–1లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు పచ్చాకుల వాసు సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాంలు, షూస్, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రితో పాటు, దాత సహకారంతో అందించిన నోట్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఆయన సూచించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించిన జనసేన నాయకుడు పచ్చాకుల వాసును ఎమ్మెల్యే ధర్మరాజు ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శప్రాయమని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.